“అమరవీరులకు సెల్యూట్‌ ” ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి

 

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సంస్మరణ సభలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్ జగన్‌.
విధి నిర్వాహణలో అసువులు బాపిన పోలీసు అమరవీరులకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం 8 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హాజరు అయ్యారు. పోలీస్‌ త్యాగధనులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల సేవలను సీఎం కొనియాడారు.అనంతరం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలీసుల సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. సాధారణ ప్రజల గౌరవం, మన్ననలు పొందేలా పోలీసులు పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు.దేశ రక్షణకై చైనా సైన్యం దాడిలో వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అధికారి కరణ్‌సింగ్‌ సహా పదిమంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. అలాంటి అమరవీరులు అందరికీ ఈ సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నా అన్నారు.
మెరుగైన వ్యవస్థ కోసం ప్రతీ పోలీస్ నిరంతరం కృషి చేయాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పోలీస్ టోపీ మీద ఉన్న మూడు సింహాలు దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని, శాంతి భద్రతల విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదని అన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైనా చట్టం ముందు నిలబెట్టాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సమావేశంలోనే చెప్పిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు. చట్టం అందరికి సమానమేనని అన్నారు.

పోలీసులు సెలవులు లేకుండా కష్టపడుతున్నారని.. అందుకే దేశంలో తొలిసారిగా వారికి వారాంతపు సెలవు ప్రకటించామన్నారు. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబాలతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారన్నారు. అవినీతి, రౌడీయిజంపై నిజాయితీగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోంగార్డుల వేతనాలను రూ. 18 వేల నుంచి రూ. 21 వేలకు పెంచామని, హోంగార్డులు మరణిస్తే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తొలి రాష్ట్రం కూడా మనదేనని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రూ.40 లక్షల వరకు బీమా సదుపాయాన్ని తీసుకొచ్చామన్నారు.