‘అర్జున్‌ సురవరం’ తెలుగు మూవీ రివ్యూ

 

Arjun Survaram

‘అర్జున్‌ సురవరం’ మూవీ రివ్యూ రేటింగ్ : 3.25/5.0

టైటిల్‌: అర్జున్‌ సురవరం
నటీనటులు: నిఖిల్‌, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళీ, సత్య, తరుణ్‌ అరోరా, నాగినీడు, విద్యుల్లేఖ రామన్‌
దర్శకత్వం: టీఎన్‌ సంతోష్‌
సంగీతం: సామ్‌ సీ.ఎస్‌
సమర్పణ: ‘ఠాగూర్‌’ మధు
నిర్మాత: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల
బ్యానర్‌:  మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ

ఈ యంగ్‌ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం అర్జున్‌ సురవరం. తమిళ సూపర్‌హిట్‌ ‘కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

అర్జున్ లెనిన్ సురవరం( నిఖిల్) టీవీ99 అనే ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అయితే బీబీసీ ఛానెల్‌లో పనిచెయ్యాలి అనేది అతని గోల్. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కోసం ఒక పబ్‌కి వెళ్లిన అర్జున్‌కి కావ్య(లావణ్య త్రిపాఠి) పరిచయం అవుతుంది. ఆమెకి తాను బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు చెబుతాడు. వాళ్ళిద్దరి పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారుతుంది. కానీ అంతలోనే అర్జున్ పనిచేస్తున్నది టీవీ99 అనే ఛానల్‌లో అని తెలుస్తుంది. దాంతో కావ్య అర్జున్‌ని అసహ్యించుకుంటుంది. కానీ తన తండ్రి వల్ల అర్జున్ ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటుంది.

ఈలోగా అర్జున్‌కి బీబీసీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జాబ్ వస్తుంది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్‌లో ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి అర్జున్‌తో పాటు మరికొందరు ఎడ్యుకేషన్‌ లోన్స్‌ పేరిట బ్యాంకులకు పెద్దమొత్తంలో టోకరా వేసినట్టు పోలీసులు అభియోగాలు మోపుతారు. అర్జున్‌తోపాటు ఇతర నిందితులకు కోర్టు శిక్ష కూడా విధిస్తుంది. కానీ ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో బెయిల్‌పైన బయటకు వచ్చిన అర్జున్‌ సురవరం ఫేక్‌ సర్టిఫికెట్స్‌, ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ రాకెట్‌ను ఎలా వెంటాడుతాడా? నకిలీ సర్టిఫికెట్లతో సమాజానికి ఎంతో చేటు చేస్తున్న ఎంతోమందిని బయటపెట్టి.. అతి పెద్ద స్కాంను, దాని సూత్రధారిని ఎలా పట్టించడాన్నది మిగతా కథ.

విశ్లేషణ:

అర్జున్ లెనిన్ సురవరం సినిమా పేరుకే తమిళ్ సినిమా కనితన్‌కి రీమేక్ గానీ తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసాడు ఈ సినిమా డైరెక్టర్ సంతోష్.ఫేక్‌ సర్టిఫికెట్స్‌తో సమాజానికి పెనుసవాలుగా నిలిచిన ఓ భారీ నెట్‌వర్క్‌ను, వ్యవస్థతో మమైకమై అతిపెద్ద స్కాంను ఓ రిపోర్టర్‌ ఎలా వెలుగులోకి తీసుకొచ్చడన్నది అర్జున్‌ సురవరం కథ. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ఈ సినిమా పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ వల్ల చదువుకున్న నిరుద్యోగులు మోసపోవడమే కాదు.. తప్పుడు పత్రాలతో డాక్టర్లు, ఇంజినీర్లు అయిన వాళ్లు సమాజానికి ఎలా ముప్పుగా మారుతున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. తమిళ రీమేక్‌ అయిన ఆ భావన రాకుండా పూర్తి తెలుగు నేటివిటీతో అర్జున్‌ సురవరంను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. మొదటి అర్ధభాగం ఇంట్రస్టింగ్‌ కథనంతో వరుస ట్విస్టులతో దర్శకుడు వేగంగా నడిపాడు. సెకండాఫ్‌లోనే కథ కొంచెం నెమ్మదించింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ నెట్‌వర్క్‌ను బయటపెట్టేందుకు హీరో ప్రయత్నించడం.. తన లోగుట్టును బయటకు లాగుతున్న హీరోను తెలుసుకునేందుకు విలన్‌ వెంటాడటం సెంకడాఫ్‌లో ప్రధానంగా కనిపిస్తుంది. ఫైట్లు, ఛేజింగ్‌లతో అక్కడక్కడ ఓవర్‌ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు సినిమాను నిలబెట్టేలా బావున్నాయి. ఎమోషనల్‌ సీన్లను దర్శకుడు బాగా చిత్రీకరించాడు. కానిస్టేబుల్‌ సుబ్బారావు (పోసాని కృష్ణమురళీ) చనిపోయిన సీన్‌లో అతని కొడుకు (వెన్నెల కిషోర్‌) భావోద్వేగాలు.. ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ నిజాయితీ గురించి చెప్పే సీన్లు బాగా పండాయి. డైలాగులు బావున్నాయి. పాటలు అంతంతమాత్రం ఉండగా.. నేపథ్య సంగీతం చాలావరకు రణగొణ ధ్వనులతో సీన్లకు సంబంధం లేనట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువులు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.