తహశీల్దార్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటిన దుండుగుడు

 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. విజయారెడ్డి దుర్మార్గమైన హత్య.. మాటలకందనిరీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ.. ఇలా అమానుషంగా దాడి చేయడం మాత్రం అత్యంత హేయమని, ఇలాంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ఆయన స్పష్టం చేశారు. తాహశీల్దార్‌ విజయారెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.బ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెకు కాపాడాటానికి ప్రయత్నించిన పలువురు కూడా గాయాల పాలయ్యారు. కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. మొదట తహశీల్దార్‌తో మాట్లాడటానికి లోపలికి వెళ్లిన దుండుగుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్‌ కార్యాలయానికి సురేశ్‌ వచ్చాడు. తహశీల్దార్‌తో మాట్లాడాలంటూ పర్మిషన్‌ తీసుకుని విజయారెడ్డి గదిలోకి వెళ్లాడు. లంచ్‌కు వెళ్లాల్సిన ఆమె ఆగిపోయి అతడితో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు అక్కడ ఉన్నాడు. తర్వాత ఆమెతో వాగ్విదానికి దిగినట్టు తెలిసింది. తర్వాత తలుపులు మూసేసి విజయారెడ్డిపై దాడిచేశాడు. అరుపులు విన్న విజయారెడ్డి డ్రైవర్‌ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించగా కాలిన గాయాలతో సురేశ్‌ బయటకు వచ్చాడు. విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు అంటుకున్నాయని చెబుతూ చొక్కా విప్పేసి అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టాడు. కాలిన గాయాలతో పోలీస్‌ స్టేషన్‌ ముందు పడిపోయాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌కు 60 శాతం గాయాలయ్యాయి. హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి గ్రామానికి చెందిన సురేశ్‌ భూవివాదం కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. తన భూమి సమస్యలు పరిష్కారించాలని కొంతకాలంగా సురేశ్‌ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే విజయారెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. విజయారెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.