‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ రివ్యూ:మెప్పించిన బాలయ్య

NTR Kathanayakudu Movie Review

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ రేటింగ్ : 3.25/5.0

విడుదల తేదీ : జనవరి 09, 2019

నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్ , ప్రకాష్ రాజ్ , రానా, సుమంత్

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

నిర్మాతలు : బాలకృష్ణ , సాయి కొర్రపాటి , విష్ణు ఇందూరి

సంగీతం : కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్

ఎడిటర్ : రామకృష్ణ

ఎన్టీఆర్ నోట ఆ మాట ..

ప్రస్తుతం సినీ పరిశ్రమలలో బయోపిక్ ల పర్వం నడుస్తుందనే చెప్పాలి.ఈ క్రమంలో క్రిష్ ,బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’,ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈరోజు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదలైంది.ఈ సినిమాతో బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారుతుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.చూద్దామా బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో ఏమేరకు మెప్పించారో.

కథ:

క్యాన్సర్‌తో బాధపడుతున్న బసవ రామ తారకం(విద్యాబాలన్‌) పరిచయంతో సినిమా ప్రారంభమవుతుంది.ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ను చూస్తుండగా అసలు కథ స్టార్ట్‌ అవుతుంది.రామారావుకు (బాలకృష్ణ) రిజిస్టర్‌ ఆఫీస్‌లో ఉద్యోగం వస్తుంది.లంచాలతో అవినీతితో నిండిపోయిన ఆ మనుషుల మధ్య ఉండలేక మూడు వారాల్లోనే ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఒకసారి రామారావు వేసిన నాటకం ఎల్వీ ప్రసాద్‌ (జిష్షు) చూస్తాడు.ఎన్టీఆర్ నటన నచ్చడంతో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్తారు.దాంతో ఎన్టీఆర్ ఆయన్ను కలిసేందుకు మద్రాస్‌ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన రామారావు సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి. అక్కినేని నాగేశ్వర్రావు (సుమంత్‌)తో ఆయన అనుబంధం. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్‌ ఎదిగిన తీరు. ఆయన్ను రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ. చివరగా ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ప్రకటించటంతో తొలి భాగాన్ని ముగించారు.

నటీనటులు:

సినిమా అంతా ఒక్క ఎన్టీఆర్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది.ప్రతీ సన్నివేశంలో బాలయ్యే తెర మీద కనిపిస్తారు. ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య లుక్‌ అంతగా ఆకట్టుకునేలా లేదు. నటన పరంగా చూస్తే బాలకృష్ణ తండ్రి పాత్రలో యిట్టె ఒదిగిపోయారు. కాస్త వయసైన పాత్రలో బాలయ్య లుక్‌, నటన చాలా బాగుంది.సినిమాలో మరో కీలకమైన పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ రామ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్‌ లాంటి నటిని ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్ధమవుతుంది.ఆమె తన నటనతో ఆ పాత్ర స్థాయిని ఎంతో పెంచారు .సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమ్‌ రావుది.ఈ పాత్రలో చాలా కాలం తరువాత దగ్గుబాటి రాజా వెండితెర మీద కనిపించాడు. లక్ష్మణుడి లాంటి తమ్ముడిగా రాజా నటన మెప్పిస్తుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోలేనంత స్థాయిలో ఆ పాత్రలో ఒదిగిపోయాడు సుమంత్‌. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా హేమీల్లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఏ పాత్ర ఒకటి రెండు నిమిషాలకు మించి తెర మీద కనిపించదు.

విశ్లేషణ:

యన్‌.టి.ఆర్‌ లాంటి మహానటుడి జీవిత కథను వెండితెర మీద చూపించడాన్ని క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈ కథను మెప్పించడంలో క్రిష్ చాలా వరకు విజయం సాదించాడనే చెప్పొచ్చు.ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీఆర్ తెరమీద కనిపించే సన్నివేశానికి థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. ఎన్టీఆర్‌, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు.అక్కడక్కడా కథను కాస్త సాగదీసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాకు ప్రధాన బలం కీరావాణి సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో సన్నివేశాల స్థాయిని పెంచారు కీరవాణి. రచయిత సాయి మాధవ్‌ బుర్రా మనసును తాకే మాటలతో మెప్పించారు. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫి సినమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. బాలయ్య హీరోగానే కాక నిర్మాతగాను మంచి మార్కులు సాధించారు. ఎన్టీఆర్ కథను అభిమానులకు అందించేందుకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చు పెట్టారు.