ఢిల్లీ లో సరి-బేసి విధానం అమలు

 

 

odd and even scheme in delhi
odd and even scheme in delhi

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరడంతో వాహనాల నియంత్రణ కోసం సరి-బేసి విధానం సోమవారం నుంచి తిరిగి అమల్లోకి వచ్చింది. తమ కుటుంబాలు, పిల్లలను కాపాడుకునేందుకు ఈ పద్ధతికి సహకరించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తల్లితండ్రులను కోరారు. నవంబర్‌ 15 వరకూ సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ విధానం నుంచి ద్విచక్రవాహనాలు, ఎలక్ర్టిక్‌ వాహనాలను మినహాయించారు. 12 ఏళ్లలోపు చిన్నారులతో కూడిన మహిళలు నడిపే వాహనాలకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, ఎమర్జెన్సీ సహా 29 కేటగిరీలకు చెందిన వాహనాలను కూడా ఈ విధానం నుంచి మినహాయించారు. సరి-బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ 4000 జరిమానా విధిస్తారు. నగరమంతటా ఈ విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులతో కూడిన 600కి పైగా టీంలను రహదారులపై నియోగించారు.ఢిల్లీ సీఎం, మంత్రుల వాహనాలకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేకపోవడం గమనార్హం.