టీడీపీకి షాక్ వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనుండటంతో ఏపీ, తెలంగాణల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు తరలివస్తున్నారు.

వైసీపీ వైపు ఆకర్షితులవుతున్న ప్రజాప్రతినిధులు, తటస్థులు

ఎన్నికలకు నెలరోజులే ఉండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.వైసీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే పలు కీలక నేతలు వైసీపీలో చేరగా తాజాగా, గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ మూర్తి అలియాస్ బాబ్జి వైఎస్సార్‌సీపీలో చేరారు.

లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బాబ్జీ భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బాబ్జికి పాలకొల్లు టికెట్ కేటాయించే అవకాశం ఉందని సమాచారం.

పార్టీలో చేరిన అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఒక యజ్ఞమని కొనియాడారు. రాష్ట్ర అవసరాలు దగ్గరి నుంచి గమనించి.. వాటినుంచి వైఎస్‌ జగన్‌ ఎంతో నేర్చుకున్నారని తెలిపారు.

Advertisement