వినయ విధేయ రామ మూవీ రివ్యూ:బోయపాటి ముంత మసాలా!

VVR Movie Review

వినయ విధేయ రామ మూవీ రేటింగ్ : 2.25/5.0

విడుదల తేదీ : జనవరి 11, 2019

నటీనటులు : రామ్ చరణ్, కియార అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ

దర్శకత్వం : బోయపాటి శ్రీను

నిర్మాత : డివివి దానయ్య

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రిషి పంజాబీ – ఆర్థర్ ఏ విల్సన్

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

ఇదీ.. టాలీవుడ్ లో చరణ్ కే సాధ్యమా?

వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ ను,కమర్షియల్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కించారు.ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రామ్‌చరణ్‌ తన సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా?, బోయపాటి మాస్‌ ఫార్ములా వర్క్‌ అవుట్‌ అయ్యిందా? చూద్దామా మరి.

కథ:

పుట్టుకతో అనాధలయిన నలుగురు అన్నదమ్ములకు ,ఆపదలో ఉన్న ఓ చిన్న పిల్లాడు దొరుకుతాడు.ఆ పిల్లాడే రామ (రామ్ చరణ్).వీరు ఐదుగురు కలిసి కుటుంబంలా కలిసుంటారు.తన భవిష్యత్తును కాదనుకొని అన్నలను పెద్ద చదువులు చదివిస్తాడు రామ.

పెద్దవాడు భువన్‌ కుమార్‌ (ప్రశాంత్) అంటే అందరికీ గౌరవం.భువన్‌ కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా వైజాగ్‌లో పని చేస్తుంటాడు.ఓ సమయంలో భువన్ కుమార్ కు పందెం పరుశురాం (ముఖేష్‌ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు.

అదే సమయంలో బీహార్‌ లోని ఓ ప్రాంతాన్ని తను కనుసైగలతో శాసిస్తున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌). రాజు భాయ్‌ తన ప్రాంతంలో ఎలక్షన్‌ లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి, భువన్‌ కుమార్‌ను అక్కడికి ఎలక్షన్‌ కమీషనర్‌ గా పంపిస్తారు. తనకు ఎవరు ఎదురొచ్చినా అంతం చేసే రాజు భాయ్‌, భువన్‌ కుమార్‌ను ఏం చేశాడు? అన్న కోసం రామ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

నటీనటులు:

రామ్ చరణ్ నటన విషయానికి వస్తే, రామ్.. రామ్ కొ ణి దె ల పాత్రలో మెప్పించాడు.ఇంతకు ముందు చేసిన మాస్ పాత్రలకంటే ఇంత పవర్ఫుల్ పాత్రలో కనిపించాడు.యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ డైలాగ్స్ తోనే కాకుండా సున్నితమైన ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనని కనబరిచాడు.ముఖ్యంగా చరణ్ సిక్స్ ప్యాక్ తో కూడిన టాటూ లుక్ కి అందరూ ఫిదా అవుతారు.

కియార అద్వానీ అందంతో,నటన తో మరోసారి కట్టిపడేస్తుంది.కానీ ఆమె చాలా కొన్ని సీన్స్ కే పరిమితయింది.రామ్ చరణ్ – కియార అద్వానీ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.

చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్, సెటిల్డ్ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. విలన్‌ గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.

విశ్లేషణ:

బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే హీరోని ఇది వరకు చూడని ఒక కొత్త తరహాలో చూపించాడు.రామ్‌ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొని నాలుగు సంవత్సరాలు కథ రాశానని ఆయన చెప్పారు.కానీ చరణ్ కి తగ్గ కథ లా అనిపించలేదు .తెర నిండా నటీనటులు ఉన్నా ఎవరినీ సరిగ్గా వినియోగించుకోలేదు. ఒక దశలో యాక్షన్‌ సీన్స్‌ మధ్యలో వచ్చి పోతున్న భావన కలుగుతుంది.

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఆకట్టులేక పోయాడు.రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఓవరాల్ గా కొన్ని కొన్ని సీన్స్ లో రామ్ చరణ్ ని చూపిన విధానం, తనతో చెప్పించిన డైలాగ్స్, చేయించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఇంతకు ముందు చూడలేదనే చెప్పాలి. ఎప్పటిలానే బోయపాటి కథకి ఎం రత్నం రాసిన మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఒక్క మాటలో : అదే బోయపాటి ముంత మసాలా !