యాత్ర మూవీ రివ్యూ:వైయస్సార్ అభిమానులకు మాత్రమే!

Yatra Movie Review

యాత్ర మూవీ రివ్యూ రేటింగ్ :3.5/5.0

టైటిల్ : యాత్ర
జానర్ : బయోగ్రాఫికల్‌ మూవీ
తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్‌, అనసూయ, పోసాని కృష్ణమురళి
సంగీతం : కె
దర్శకత్వం : మహి వీ రాఘవ
నిర్మాత : విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి

దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’.మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైయస్సార్ పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టి నటించారు.కాగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన యాత్ర ఎలా ఉందో చూద్దామా?.

యాత్ర ట్రైలర్:వస్తున్నాడు ప్రజా సైనికుడు

కథ:

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా వైయస్సార్(మమ్ముట్టి ) ఉన్న రోజులవి.2004 ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తధ్యమని అన్ని సర్వేలు ఎన్నికల ముందే ఫలితాలను వెల్లడిస్తాయి.దీంతో ఏమాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని కాంగ్రెస్ నేతలకు వైయస్సార్ భరోసా ఇస్తాడు.ఆ భరోసానే ఈ పాదయాత్ర.కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే సంకల్పంతో ఆయన పాదయాత్రను మొదలుపెడతారు.గెలుపు కోసం బయలు దేరిన వైయస్సార్ కు ప్రజల కష్టాలు ,కన్నీళ్లు కనిపిస్తాయి.అలా మొదలైన పాదయాత్ర రాజశేఖర్‌ రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ.

నటీనటులు:

పాదయాత్ర ఆధారంగా రావడంతో సినిమా అంతా ఒక్క రాజశేఖర్‌ రెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి సన్నివేశం నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నామా అన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు.రాజశేఖర్ రెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్‌ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. ఇక అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళి వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు.సాంకేతిక విభాగం విషయానికి వస్తే,మహి.వి.రాఘవ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.సంగీత దర్శకుడు ‘కె’ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా రైతు పాట చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేష‌ణ‌ :

రెగ్యులర్‌ బయోపిక్‌ లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ, సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి, రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు.పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్‌ఆర్‌ లో వచ్చిన మార్పులను వెండితెర మీద ఆవిష్కరించారు .తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే, సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.

హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా, ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్‌ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది. మార్కెట్‌ లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్ని సన్నివేశం ఆయనలోని నాయకుడిని జ్ఞప్తికి తెస్తుంది.

సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీన్స్‌ మరో ఎత్తు.అప్పటి వరకు వైఎస్‌ఆర్‌ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే సన్నివేశాలు భావోద్వేగానికి గురి చేస్తాయి. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది.మొత్తానికి మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌ తో దర్శకుడు ప్ర‌తి ప్రేక్ష‌కుడి గుండెను టచ్ చేస్తాడు.చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ రేంజ్ లో నిలబడుతుందో.